21.2.12

మనసులో ఆలోచనలా...? ఆలోచనలే మనసా...??మొన్న గాడ్పై వెళ్ళిన వేసంగిని..., 


నిన్న జల్లై రాలిన తొలకరిని..., 


ఈ రోజు మోడవుతున్న చెట్టుని..., ... 


అన్నిటినీ ఆస్వాదిస్తాను నేను. ప్రతి రోజూ అలంకరించుకునే కొత్తదనం నాకు ఉత్సాహాన్నిస్తుంది. 


రోజూ వడగాలైతే, ప్రతి నిముషం వానే కురిస్తే, ఎప్పుడూ ఆకులు రాలుతూనే ఉంటే... నాలో ఈ ఆనందం ఉండదు. అందులో సందేహమే లేదు. 


మోడైన ఈ వేపచెట్టు ఎప్పుడు చిగురిస్తుందా అని ఎదురుచూసే నేనే; ముదిరిన సన్నజాజి ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా త్రుంచివేస్తాను. 


ఎప్పుడూ ఒకేలా ఉంటే జీవితం నిస్సారమైనట్టు నీరసించిపోతాను కదా... మరి ప్రతీ క్షణం నా చెంతనే ఉండే నిన్నూ, నీ మాటల్నీ... ఎలా, ఎందుకు ఇష్టపడుతున్నాను...? 


అన్ని విషయాల్లోనూ కొత్తదనాన్ని ఆస్వాదించే నేను... నీ విషయంలో మాత్రం విభిన్నంగా ఉన్నానేం...? 


అంటే నాలో... నాకే తెలీని వైరుధ్యమా...! ఏది ఇష్టమో అదే అయిష్టమా...!! 


ఇష్టం, అయిష్టం అన్నవి ఆలోచనలకి సంబంధించినవి. నువ్వు అనేది మనసుకి సంబంధించింది. 


అంటే... ఆలోచనలూ, మనసూ ఒక్కటి కాదా...?5 వ్యాఖ్యలు:

సుభ /Subha said...

నాకైతే కాదనే అనిపిస్తుందండీ.. మనసుతో చేసే ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి.(నా ఆలోచనలు అలానే ఉంటాయేమో అని నాకనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ నా అభిప్రాయం అలా చెప్పడం జరిగింది.)ఏదేమైనా "మోడైన ఈ వేపచెట్టు ఎప్పుడు చిగురిస్తుందా అని ఎదురుచూసే నేనే; ముదిరిన సన్నజాజి ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా త్రుంచివేస్తాను." ఈ ఒక్క వాక్యం ఎందుకో మనసుకు బాగా హత్తుకుపోయింది.

వేణూ శ్రీకాంత్ said...

చాలా బాగుందండీ...
మనసు ఆలోచనలు మొదలే కన్ఫూజింగ్ టాపిక్స్.. మీరు ఇంకాస్త కన్ఫూజ్ చేసి వదిలేశారు :-))

డేవిడ్ said...

చాలా బాగుందండి మీ పోస్టు

గీతిక బి said...

ధన్యవాదాలు సుభ గారూ.

//"మోడైన ఈ వేపచెట్టు ఎప్పుడు చిగురిస్తుందా అని ఎదురుచూసే నేనే; ముదిరిన సన్నజాజి ఆకుల్ని నిర్దాక్షిణ్యంగా త్రుంచివేస్తాను."//
ఈ వాక్యం నాలోని ద్వైదీ భావంలోంచి వచ్చింది. మనం బాధ పడాల్సిన విషయమేంటంటే మనలోనే వ్యతిరేక భావాలున్నాయన్న నిజం. అలాంటివే మనకి గాఢంగా అనిపిస్తాయి. అందుకే మీకా వాక్యం నచ్చిందేమో...

గీతిక బి said...

@ ధన్యవాదాలు వేణూ శ్రీకాంత్ గారూ...
వ్రాస్తూ నేనూ తికమక పడ్డానండీ...!!


@ మీ అభినందనలకి ధన్యవాదాలు డేవిడ్ గారూ..