31.10.10

"ఆవిష్కరణ" - ఆల్కహాలిక్‍ల పిల్లలు, ఒక అవగాహన

ఓ చల్లని సాయంత్రం వేళ...

నల్లగా నిగనిగలాడుతున్న రోడ్డు మీద మధ్యస్త వేగంతో ఓ మోటార్ బైక్... దాని మీద అందమైన ఓ జంట, ఆమె ఒడిలో అపురూపంగా, అతి సున్నితంగా ఉన్న ఏడాది బాబు. ప్రసన్నంగా, ఆహ్లాదంగా ఉన్న వాళ్ళని చూడగానే అర్థమవుతోంది వాళ్ళ మధ్య ఆనందం నిండి ఉందని.

అతనో ప్రభుత్వోద్యోగి. ఆమె గృహిణి. వాళ్ళ మధ్య కొత్తగా చిగురేసిన కొమ్మ ఆ బుడతడు. ఏ బాధలు, బాదరబందీలూ లేని వాళ్ళ సంసారం చాలా హాయిగా సాగిపోయేది(దే).

చల్లగా ఉన్న సాయంత్రానికి చీకటి తోడయ్యింది. సూర్యుడి నిష్క్రమణతో వచ్చిన చీకటి కాదది... మేఘాల ఆగమనంలోని మసక అది. మబ్బులు వచ్చీరావడంతోనే కురవడం మొదలుపెట్టాయి.

వానని తొలిసారిగా చూస్తున్న బాబు గమ్మత్తుగా ఆకాశం వంక చూస్తున్నాడు. 'వర్షం పెరుగుతోంది.. బాబు తడిచిపోతాడామో.. త్వరగా ఇంటికెళ్ళాలి...' అన్న ఆత్రం ఆమెది. 'అబ్బ.. చలిగా ఉంది. హ్యాప్పీగా ఓ క్వార్టరేస్తేనా...' అతని ఆలోచన అది.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇలా ఆలోచించే వాళ్ళు మన చుట్టూ ఉన్న సమాజంలో (ఈ రోజుల్లో) చాలా మందే ఉన్నారు. ఆమె ఆలోచనలకీ, అతని ఆలోచనలకీ ఉండే బేధం చాలా విషయాల్లో, చాలా సంఘటనల్లో మనం చూస్తూనే ఉంటాం. ఆలోచనల వరకైతే పర్లేదు. కానీ కొందరు పక్కనున్న వాళ్ళని పట్టించుకోకుండా తమకనిపించిందే తడవు, గజానికొకటిగా వెలుస్తున్న బారుల ముందు నుంచుంటారు. తాగిన తర్వాత మనసే కాదు నోరూ ఆధీనంలో ఉండదు. ఆ మైకంలో పరిస్థితులు అదుపుతప్పి చేజారితే... ...? ప్రయాణం... ప్రాణాపాయం అయితే...?

తప్పు ఒక్కరే చేసినా దాని పర్యవసానం అనుభవించాల్సింది మాత్రం కుటుంబ సభ్యులంతా. ఇది నూరుపాళ్ళూ కాదనలేని నిజం. ఇది ఎంత నిజమో... వాళ్ళ అలవాటుని మానిపించాలని ప్రయత్నించే వాళ్ళు వీరి పక్కనే ఉంటారన్నదీ అంతే నిజం.

అలాంటి వాళ్ళ కోసమే శ్రీదేవి మురళీధర్ గారు తాపత్రయపడి వ్రాసి, మనకందిస్తున్న ఆవిష్కరణ అనే ఈ పుస్తకం.


ఈ పుస్తకం... తాగే వారి కోసమే కాదు, ఆల్కహాలిక్ అలవాటుని మానిపించాలనుకునే వాళ్ళ కోసం కూడా. ఎందుకంటే దీన్లో ఆల్కహాల్ అలవాటున్న వారి పిల్లల మీద ఆల్కహాలిక్‍ల ప్రభావం ఎలా ఉంటుంది అన్నదీ, దీన్ని మాన్పించే డిఎడిక్షన్ సెంటర్ల అడ్రసులూ ఉన్నాయి. మీకు తాగే అలవాటుండి, మానాలనుకుంటే లేదా ఎవరిచేతనైనా మానిపించాలని మీరు అనుకుంటున్నట్లయితే ఈ పుస్తకాన్ని మిస్ కాకండి.

మీకు ఈ పుస్తకం కావాలంటే, దీని గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మెయిల్‍ ఐడీ projectnishedh@gmail.com కి మెయిల్ చెయ్యండి. పుస్తకం (పూర్తి ఉచితంగా) కావాలనుకునే వారు క్రింది అడ్రస్‍ని కాంటాక్ట్ చెయ్యండి.

V.B.Raju Social Health Foundation
'Sravana' 2-2-19/1, D.D.Colony,
Hyderabad - 500 007

చిన్న అభ్యర్థన: మీకు తెలిసిన ఈ వివరాలని అవసరమున్న నలుగురికీ పంచండి.
*ఈ పుస్తకాన్ని వ్రాసి, సమాజ సేవ (శ్రేయస్సు) కోసం తపన పడుతున్న శ్రీదేవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. *

Sreedevi Muralidhar - Aavishkarana - children of Alcoholics - An understanding

2 వ్యాఖ్యలు:

ఆత్రేయ said...

మీ టపా బాగుంది చాలా ఉపయుక్తం

కానీ ఆల్కహాల్ కి మందు మందు అని మాట వాడటం బాలేదు

వైద్య పరంగా వాడే మందు మాటని ఆ దిక్కుమాలిన

సారా కి వాడటం అపచారం

Kathi Mahesh Kumar said...
This comment has been removed by a blog administrator.